నేడు మంచిర్యాలలో సిఎం కేసీఆర్‌ పర్యటన

సిఎం కేసీఆర్‌ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనం, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ఆయన ప్రారంభిస్తారు. తర్వాత నర్సాపూర్ మండలంలోని ప్రభుత్వాసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 

చెన్నూరులో రూ.1,658 కోట్లు అంచనా వ్యయంతో నిర్మించబోయే చెన్నూరు ఎత్తిపోతల పధకానికి, మందమర్రిలో 26.24 ఎకరాలలో పండిస్తున్న ఆయిల్ పామ్ విత్తనాలను ప్రాసెసింగ్ చేసేందుకు రూ.55.20 కోట్లు వ్యయంతో నిర్మించబోయే ప్లాంటుకు శంకుస్థాపన చేస్తారు. మంచిర్యాల- పెద్దపల్లి జిల్లాలోని అంతర్ గావ్‌ని కలుపుతూ గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి కేసీఆర్‌ ఈరోజు శంకుస్థాపన చేస్తారు.

రాత్రి 7.30 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కులవృత్తులు చేసుకొనేవారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పధకం ద్వారా లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందజేస్తారు. అలాగే ఎంపిక చేసిన గొల్ల కురుమలకు ఒక్కొక్కరికీ 21 గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.