
బిఆర్ఎస్ పార్టీలో ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ సీట్లు ఇస్తాను... మీ అంతటా మీరు పాడుచేసుకోవద్దని సిఎం కేసీఆర్ చిలక్కి చెప్పిన్నట్లు చెప్పారు. కానీ కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు పార్టీకే మచ్చ తెస్తోంది.
కొన్ని నెలల క్రితమే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జానకీపురం మహిళా సర్పంచ్‌ని లైంగికంగా వేధించినప్పుడు ఆమె మీడియా ప్రతినిధుల ఎదుటే ఆయనకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు జగిత్యాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తనను వేధిస్తున్నాదంటూ జగిత్యాల మునిసిపల్ ఛైర్ పర్సన్ భోగ శ్రావణి మీడియా ఎదుట కన్నీళ్ళు పెట్టుకొని తన పదవికి రాజీనామా చేశారు. అయినా పార్టీ అధిష్టానం స్పందించకపోవడంతో ఆమె పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. వేములవాడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఇలా చెప్పుకొంటే చాలా పెద్ద జాబితాయే ఉంది. ఆ జాబితాలో మరో కొత్త పేరు చేరింది.
ఆయనే బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. జగిత్యాలలో ఆరిజన్ డెయిరీ సీఈవో శైలజ ఆయన తనను మానసికంగా, లైంగికంగా వేధించారని, అమ్మాయిలను పంపించాలని ఒత్తిడి చేశారంటూ జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో తెలంగాణ భవన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె పిర్యాదుపై స్పందించిన జాతీయ మహిళా కమీషన్ తెలంగాణ డిజిపి అంజని కుమార్‌కు లేఖ వ్రాసింది. బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే లైంగిక వేధింపుల వ్యవహారంపై 15 రోజులలోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని దానిలో ఆదేశించింది.