ఆనాడు కళ్ళలో ఇంకిన నీళ్ళు... నేడు పొలాలో గలగలపారే నీళ్ళు!!

తెలంగాణ ఏర్పడక మునుపు త్రాగు, సాగు నీటి కోసం ప్రజలు ఎంతగా అల్లాడిపోయేవారో అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గలగలాపారుతున్న గోదావరి కాలువలే... వాటి పక్కనే పచ్చటి తివాచీలు పరిచిన్నట్లు కళకళలాడే పంట పొలాలు. ప్రతీ ఇంటికీ నల్లాల ద్వారా స్వచ్చమైన త్రాగునీరు అందుతోంది. 

తెలంగాణ ఉద్యమ కాంక్షలలో నీళ్ళు కూడా ఒకటి. తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్‌ దానిని సాకారం చేసి ప్రజల దాహార్తిని తీర్చి, బీడుభూములకు నీళ్ళు అందించి ఏడాదికి మూడు పంటలు పండేలా చేశారు. పాలకులకు దూరదృష్టి, ప్రజలు, రాష్ట్రం పట్ల తపన, చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష ఉంటే ఏదైనా సాధ్యమే అని కేసీఆర్‌ నిరూపించి చూపారు. 

ఆనాడు కేసీఆర్‌ని విమర్శించినవారే నేడు నీరాజనాలు పలుకుతున్నారు. ఏపీ నుంచి విడిపోతే తెలంగాణ మనుగడ సాగించలేదన్న ఆంద్రా పాలకులనే తెలంగాణలో జరుగుతున్న ఈ అభివృద్ధిని చూపిస్తూ ఇప్పుడు ఆంధ్రా ప్రజలు నిలదీస్తున్నారంటే రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులలో ఎంత తేడా ఉందో అర్దం చేసుకోవచ్చు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో నాటికి, నేటికీ గల వచ్చిన మార్పులను వివరిస్తూ ఓ ఆసక్తికరమైన సందేశం, దానితో పాటు కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. ఇవి చూసినప్పుడు నిజమే అని ప్రతీ ఒక్కరూ అంగీకరిస్తారు.     

“జలదృశ్యం నుంచి.. సుజల దృశ్యం దాకా... తెలంగాణ జల విధానం.. మన భారత దేశానికే కాదు.. యావత్ ప్రపంచానికే ఆదర్శం నాడు... ఉమ్మడి పాలనలో తెలంగాణ వ్యవసాయ రంగంలో సంక్షోభం రైతన్నల బతుకు అత్యంత దుర్భరం నేడు... ఒకే ఒక్కడి సంకల్పంతో... సాగునీటి రంగంలో స్వర్ణయుగం… నాడు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నడు దాశరథి నేడు నా తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసిం.” 

“నదికే నడక నేర్పిన... ధీరోదాత్తమైన నాయకత్వం... జీవం కోల్పోయిన గోదావరికి ప్రాణం పోసిన చారిత్రక సందర్భం... విశ్వ వేదికపై మెరిసిన మానవ నిర్మిత అద్భుతం... చుక్క నీటి కోసం అల్లాడిన నేలకు ప్రతినిత్యం జలాభిషేకం... ఒక్క కాళేశ్వరం... దగాపడ్డ ప్రతి రైతు బిడ్డకు.. వచ్చే వందేళ్ళ వరకూ.. తిరుగులేని అభయండు కేసీఆర్!”

“ప్రతిపక్షాలు కుట్రలెన్ని పన్నినా... కేంద్రం నీటి వాటాలు తేల్చకున్నా.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణంలోనూ మెరుపు వేగం అతి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా సాకారం చిన్న నీటి పారుదల రంగానికీ పెద్ద పీట వేసిన ఏకైక రాష్ట్రం.. మన తెలంగాణ. ఈ జల విజయంలో సీఎం కేసీఅర్ గారి సారథ్యంలో కాలంతో పోటీపడి కదం తొక్కిన... జై కిసాన్ నినాదాన్ని నిజం చేసిన... ఇంజనీర్లకు, శ్రామికులకు, నీటి పారుదల శాఖ ఉద్యోగులకు. పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికీ.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు,” అంటూ వరుస ట్వీట్స్ చేశారు.