లక్ష రూపాయలు కావాలా నాయినలారా... ఇవిగో దరఖాస్తులు!

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కులవృత్తులు చేసుకొనేవారిని ప్రోత్సహించేందుకు లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందజేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మంగళవారం ఆ వెబ్‌సైట్‌ https://tsobmmsbc.cgg/gov.in ను ప్రారంభించారు.

దీనికి కులవృత్తులు చేసుకొంటున్నవారందరూ అర్హులేనని చెప్పారు. కనుక అర్హులైనవారు తమ ఫోటో, ఆధార్, కులదృవీకరణ పత్రాలతో ఈ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారిలో నుంచి కొందరిని ఎంపిక చేసి ఈ నెల 9న మంచిర్యాల జిల్లాలో సిఎం కేసీఆర్‌ చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కులు అందిస్తామని చెప్పారు. అర్హులలో మిగిలినవారికి దశలువారీగా ఆర్ధికసాయం అందజేస్తామని తెలిపారు.

దీంతో లబ్ధిదారులు తమ కులవృత్తులకు సంబందించిన పరికరాలు, ముడి సరుకు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆర్ధిక సాయం వంద శాతం రాయితీతో అందిస్తున్నందున అబ్ధిదారులు తిరిగి చెల్లించనవసరం లేదు. కనుక అర్హులైన వారు  వెంటనే ఆన్‌లైన్‌లో తమ వివరాలతో దరఖాస్తు చేసుకొంటే మంచిది.