ఒడిశా దుర్ఘటనలో సీబీఐ దర్యాప్తు షురూ

ఇటీవల ఒడిశాలో జరిగిన రైళ్ళ ప్రమాదంలో 278 మరణించగా, వెయ్యికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో ఎవరో ఉద్దేశ్యపూర్వకంగానే మార్పు చేయడం వలననే మెయిన్ లైన్లో వెళ్లవలసిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ లూప్ లైనులో ప్రయాణించి ఆ ట్రాక్ మీద నిలిపి ఉంచిన గూడ్స్ రైలును ఢీకొనడంతో ఈ ఘోరప్రమాదం జరిగిన్నట్లు రైల్వే సేఫ్టీ కమీషన్‌ ప్రాధమిక దర్యాప్తులో తేలింది. దాని ఆధారంగా ఒడిశా రైల్వే పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే ఈ దుర్ఘటనలో కుట్ర జరిగిన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో కేంద్రం ఆదేశం మేరకు సీబీఐ రంగంలో దిగింది. మొత్తం పదిమంది సీబీఐ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదంలో ప్రత్యక్ష సాక్షులు, రైల్వే సిబ్బందిని, సహాయ చర్యలలో పాల్గొన్నవారిని, ఇంకా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ లోకో పైలట్లను, క్షతగాత్రులను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించి, ఈ ప్రమాదం వెనుక నిజంగానే ఏదైనా కుట్ర జరిగిందా లేక మానవ తప్పిదం లేక సాంకేతిక లోపం వలన జరిగిందా?అనే విషయం కనిపెట్టనున్నారు. 

సీబీఐ దర్యాప్తు పూర్తవడానికి కనీసం రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చని సమాచారం. ఈ ఘటన గురించి ఎవరైనా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తే వారిపై కటిన చర్యలు తీసుకొంటామని కేంద్ర ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం, సీబీఐ కూడా హెచ్చరించాయి.