37.jpg)
తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సిఎం కేసీఆర్ ఎన్నికలకు పార్టీని, ప్రజలను సిద్దం చేసేందుకు జిల్లా పర్యటనలు మొదలుపెట్టారు. ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించి అనేక వరాలు కురిపించిన సిఎం కేసీఆర్ రేపు మంగళవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించబోతున్నారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గం ద్వారా నాగర్కర్నూల్ జిల్లాకు చేరుకొంటారు. రూ.52 కోట్లు ఖర్చు చేసి జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనానికి, రూ.35 కోట్లతో నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, మెడికల్ కాలేజీని కేసీఆర్ ప్రారంభిస్తారు.
ఆ తర్వాత జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు జిల్లా కేంద్రంలో బహిరంగసభలో పాల్గొని బస్సులో హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. మొన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంనాడు కాంగ్రెస్ పార్టీ వలననే తెలంగాణ ఏర్పాటయిందని కాంగ్రెస్ నేతలందరూ గట్టిగా నొక్కి చెప్పడం కాక, ఆనాడు తెలంగాణ ఉద్యమాలలో తామందరం ఏవిదంగా పోరాడామో తెలియజేసే న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, ఫోటోలు, వీడియోలను విస్తృతంగా ప్రచారం చేసుకొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ యాక్టివ్గా అయ్యినట్లు బహుశః కేసీఆర్ కూడా గుర్తించిన్నట్లే ఉన్నారు. అందుకే ఇంతకాలం కాంగ్రెస్ ఊసే ఎత్తని కేసీఆర్ మొన్న నిర్మల్ సభలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తెచ్చి విమర్శించారనుకోవచ్చు. కనుక రేపు నాగర్కర్నూల్ సభలో కూడా బహుశః కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించే అవకాశం ఉంటుంది.