తెలంగాణ సిఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం హైదరాబాద్లో మరో భారీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ శివారులో కోకాపేటలో బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం నామ మాత్రపు ధరలో 11 ఎకరాలు కట్టబెట్టడాన్ని కాంగ్రెస్, బిజెపిలు తీవ్రంగా విమర్శించాయి.
కానీ కేసీఆర్ ఏమాత్రం చలించకుండా నేడు అక్కడ బిఆర్ఎస్ పార్టీ కోసం 15 అంతస్తుల ‘భారత్ భవన్’ నిర్మాణానికి చండీహోమం నిర్వహించి భూమిపూజ చేశారు. ఈ ‘సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్’లో బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించుకోబోతోంది.
అయితే ఇప్పటికే హైదరాబాద్లో సువిశాలమైన, ఆధునిక హంగులన్నీ ఉన్న తెలంగాణ భవన్ ఉండగా, మళ్ళీ భారత్ భవన్ పేరుతో మరో భారీ భవనం దేనికో తెలీదు. బిఆర్ఎస్ పార్టీ ఇప్పటీకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా కార్యాలయాలు నిర్మించుకొంది.
ఇటీవలే ఢిల్లీ నడిబొడ్డున సొంతంగా ఓ కార్యాలయం నిర్మించుకొంది. త్వరలో నాగపూర్, పూణే, ఔరంగాబాద్ నగరాలలో కూడా బిఆర్ఎస్ కార్యాలయాలు నిర్మించుకొందామని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు కోకాపేటలో ఏకంగా 15 అంతస్తులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తుండటం గమనిస్తే బిఆర్ఎస్ వద్ద పుష్కలంగా డబ్బు ఉందనే విషయం చాటి చెపుతున్నట్లుంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో కేసీఆర్ జోరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా, స్థిరాస్తులు అభివృద్ధిపై దృష్టి పెడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.