ఒడిశా రైలు ప్రమాదంలో కుట్ర... సీబీఐ దర్యాప్తు

ఒడిశా రైళ్ల ప్రమాదంలో ఏదో కుట్ర ఉంది ఉండవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు ఆరోపించారో తెలియదు కానీ రైల్వే భద్రతా కమీషనర్ దర్యాప్తులో అదే నిజమని తేలింది. ఒకే ట్రాక్‌లో ఓ రైలు లేదా గూడ్స్ బండి ఉన్నప్పుడు ఆ ట్రాక్ మీదకు మరో రైలు రాకుండా అడ్డుకొనే ‘ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్’లోని ‘పాయింట్ మెషిన్ సెటింగ్స్’ని ఎవరో మార్చిన్నట్లు రైల్వే భద్రతా కమీషనర్ (ఆర్‌ఎస్ఎఫ్) గుర్తించింది. ఆ కారణంగానే మెయిన్ లైన్లో వెళ్లవలసిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ లూప్ లైన్‌లో ప్రవేశించి, అక్కడ నిలిపి ఉంచిన గూడ్స్ రైలును ఢీకొన్నట్లు ఆర్‌ఎస్ఎఫ్ గుర్తించింది.

అది పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత ఆ విదంగా జరిగేలా ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌లో ఎవరు, ఎందుకు మార్పు చేశారో తెలుసుకొనేందుకు  సీబీఐ విచారణ జరిపిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన 300 మంది కుటుంబాలకు నష్టపరిహారం అందజేశామని తెలిపారు. స్వల్పంగా గాయపడిన ప్రయాణికులకు చికిత్స చేసి ప్రత్యేక రైళ్ళలో వారి గమ్యస్థానాలకు పంపించామని చెప్పారు. 

ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ రైలు డ్రైవర్ తప్పిదం ఏమీ లేదని ప్రాధమిక దర్యాప్తులో తేలిందని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లూప్ లైన్లో వెళ్ళేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినందునే దానిలోకి ప్రవేశించి గంటకు 128 కిమీ వేగంతో రైలును నడిపిన్నట్లు గుర్తించామని తెలిపారు. అయితే అక్కడ ఇనుప ఖనిజం తీసుకువెళుతున్న గూడ్స్ రైలు నిలిచి ఉంచడం దానిని ఢీకొన్నందున ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని తెలిపారు.