శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమీషన్‌ కసరత్తు షురూ

ఈ ఏడాదిలోగా తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌, మద్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. వాటి కోసం కేంద్ర ఎన్నికల కమీషన్‌ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే కమీషన్‌ అధికారుల బృందాలు ఆయా రాష్ట్రాలలో ఒకసారి పర్యటించి, రిటర్నింగ్ అధికారులను ఎంపిక చేసి ఎన్నికల నిర్వహణలో శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలకు సూచించింది. తాజాగా ఈ 5 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు వ్రాసింది. 

ఒకే చోట మూడేళ్ళు అంతకంటే ఎక్కువ కాలంగా పనిచేస్తున్న అధికారులను వేరే జిల్లాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. అయితే ఆరు నెలల్లోగా పదవీ విరమణ చేయబోయే అధికారులకు ఈ ఆదేశాలు వర్తించవని తెలిపింది. మిగిలిన వారిలో ఎవరూ కూడా సొంత జిల్లా, నియోజకవర్గాలలో పనిచేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. జూలై 31లోగా బదిలీల ప్రక్రియ ముగించి తెలియజేయాలని ఆదేశించింది.   

బదిలీలు చేయవలసిన అధికారులు: జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, నియోజకవర్గం ఎన్నికల అధికారులు, ఎంఆర్వోలు, ఈఆర్వోలు, నోడల్ అధికారులు, తహశీల్దార్లు, పోలీస్ శాఖలో రేంజి ఐజీలు, డీఐజీలు, జిల్లా ఎస్పీలు, ఆర్ఎస్ఐలను, ఎస్సైలను బదిలీ చేయాల్సి ఉంటుందని ఎన్నికల కమీషన్‌ సూచించింది.  

తాము బదిలీ కాబోతున్న జిల్లా, నియోజకవర్గాలలో తమ బంధువులు ఎవరూ ఎన్నికలలో పోటీ చేయడం లేదని అధికారులు తప్పనిసరిగా అఫిడవిట్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశించింది. తెలంగాణ శాసనసభకు 2018 డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి కనుక మళ్ళీ ఆలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియ మూడు నెలలో విస్తరించి ఉంటుంది కనుక సెప్టెంబర్‌ లేదా కొంత ముందుగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.