తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ మూడూ కూడా ‘తెలంగాణ క్రెడిట్’ కోసం పోటీలు పడ్డాయి. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో మంత్రి హరీష్ రావు చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా స్పందించిన తీరు అందరినీ నవ్విస్తుంది.
ఇంతకీ మంత్రి హరీష్ రావు ఏమి ట్వీట్ చేశారంటే, “రానే రాదన్న తెలంగాణను సాధించి, కానే కాదన్న అభివృద్ధిని చేసి చూపెట్టింది కేసీఆర్. అనతి కాలంలోనే ప్రగతి పథంలో నడిపించి తెలంగాణను ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిపింది కేసీఆర్. 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధికి రోల్ మోడల్‌గా చేసి, 76 ఏళ్ల స్వతంత్ర భారత్‌కు మార్గదర్శిగా మార్చింది కేసీఆర్.
కేసీఆర్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాయి. తెలంగాణ ఆచరిస్తే, నేడు దేశం అనుసరిస్తున్నది. అందుకే ’తెలంగాణ మాడల్’ దేశమంతటా ఆకర్షించేలా విరాజిల్లుతున్నది. అవమానాలు, అన్యాయాలకు గురైన చోటే, స్వరాష్ట్రంలో సమగ్రాభివృద్ధి చెంది సగర్వంగా దశాబ్ది సంబురం చేసుకొంటున్న చారిత్రక సందర్బం ఇది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు,” అని ట్వీట్ చేశారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ, “వద్దే వద్దన్న కుర్చీలో కూర్చొని, ఉద్యమంలోకి రానే రానన్న కొడుకు, బిడ్డ, అల్లుడికి పదవులు ఇచ్చింది కేసీఆర్. పదేళ్ల కాలంలోనే అథ:పాతాళానికి తొక్కి, తెలంగాణను పీకల్లోతు అప్పుల్లో ముంచింది కేసీఆర్. 9 ఏళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేసి, 76 ఏళ్ల స్వతంత్ర భారతావని ముందు తెలంగాణను తలదించుకునేలా చేసింది కేసీఆర్. కేసీఆర్ చేసిన అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ప్రజల జీవితాల్లో చీకట్లు నింపాయి రాష్ట్రం ఏడుస్తుంటే కల్వకుంట్ల కుటుంబం నవ్వుతున్నది,” అని ట్వీట్ చేసింది.
మంత్రి హరీష్ రావు ట్వీట్‌లో 'తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు' లోగోను పెడితే, కాంగ్రెస్ పార్టీ 'తెలంగాణ రాష్ట్ర దశాబ్ది విషాదాలు' పేరుతో ఈ తొమ్మిదేళ్ళలో తెలంగాణలో జరిగిన అరాచకాలు, అక్రమాలకు సంబందించిన వార్తల న్యూస్ క్లిప్పింగ్స్ ఆ లోగోలో పెట్టింది.