
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అధికార బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తూ, ఈ తొమ్మిదేళ్ళలో తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి వివరిస్తుంటే, ప్రతిపక్షాలు దొర పాలనలో తెలంగాణ బందీ అయిపోయిందటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్‌లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ దొర చేతిలో చిక్కుకొంది. ఆయన చెపుతున్న బంగారి తెలంగాణ ఆయన కుటుంబానికే పరిమితమైంది. ఎన్నికల హామీలు అమలుచేయకుండా, కొత్త కొత్త హామీలు, పధకాలు ప్రకటిస్తూ కేసీఆర్ ప్రజలను మోసగిస్తుంటే, నిలదీయాల్సిన కాంగ్రెస్, బిజెపిలు ఆయనకే అమ్ముడుపోయాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రజల తరపున ధైర్యంగా ప్రభుత్వంతో పోరాడేందుకు ఏర్పాటు చేసినదే వైఎస్సార్ తెలంగాణ పార్టీ.
నిరుద్యోగ సమస్య, కేసీఆర్ కుటుంబం, దోపిడీ, టిఎస్‌పీఎస్సీ స్కామ్, ప్రాజెక్టులలో అవినీతి, అక్రమాలు, తెలంగాణ పేరు చెప్పి చేస్తున్న అప్పులు… ఇలా అన్నిటిపై గట్టిగా గొంతెత్తి ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 3800కిమీ పాదయాత్ర చేశాను. కేసీఆర్‌ని ప్రశ్నిస్తున్నందుకే నాపై బిఆర్ఎస్ గూండాలు దాడులు చేశారు. అయినా నేను భయపడకుండా ఎదురొడ్డి పోరాడుతూనే ఉన్నాను.
ఈ బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చలేవు. కనుక మీ అందరి కోసం పోరాడుతున్న ఈ రాజన్న బిడ్డను చూసి వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్ధిస్తున్నాను,” అని అన్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో సుదీర్గమైన సందేశం కూడా పెట్టారు.
తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నాననే వార్తలను ఆమె ఖండించారు. తన పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీలో విలీనం కాదు. దేనితోనూ పొత్తులు పెట్టుకోదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.