
అభివృద్ధి అంటే కేవలం భారీ భవనాలు, ఫ్లైఓవర్లు, రోడ్లు నిర్మించడమే కాదు... మారుమూల గ్రామాలలో సైతం మౌలికవసతుల కల్పించడం, పచ్చదనం పెంచడం, మళ్ళీ దానిలో పశుపక్ష్యాదులకు గూడు, ఆహారం లభించేలా చేయాలనే కేసీఆర్ ఆలోచన చాలా అభినందనీయం.
నేటికీ కేంద్రంతో సహా చాలా రాష్ట్రాలకు పర్యాటకశాఖ అంటే చాలా చిన్నచూపే. కానీ పర్యాటక రంగంలో అంతులేని సంపద దాగి ఉందనే విషయం కేసీఆర్ చూపిస్తున్నారు. ఇదివరకు ఆదరణకు నోచుకోని అనేక పర్యాటక ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయడమే కాకుండా, ప్రతీ జిల్లాలో చెరువులు, పార్కులు, ట్యాంక్బండ్లు, చిన్న చిన్న అడవులు పెంచుతూ పర్యాటక రంగాన్ని చాలా అభివృద్ధి చేసింది.
ఒకప్పుడు తెలంగాణ అంటే హైదరాబాద్… హైదరాబాద్ అంటే ఛార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం అనే బ్రాండ్ ఇమేజ్ ఉండేది. కానీ నేడు హైదరాబాద్ అంటే ఐటి కంపెనీలు, విదేశాలను తలపించే ఎత్తైన భవనాలు, విశాలమైన ఫ్లైఓవర్లు, స్కై వాక్‌లు, దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జ్, సచివాలయం, డా.అంబేడ్కర్ విగ్రహం, అనేక అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు, కంపెనీలు, కౌన్సిలేట్లు, గ్లోబల్ సదస్సులు, మెట్రో పరుగులు, ఫార్ములా వన్ రేసింగ్‌లు ఒకటేమిటి చాలానే ఉన్నాయి చెప్పుకోవడానికి. సాధారణంగా నగరాలు అభివృద్ధి చెందుతుంటే ఆ మేరకు పచ్చదనం తగ్గిపోతుంటుంది కానీ హైదరాబాద్ నగరం ఎంతగా అభివృద్ధి చెందుతుంటే నగరంలో పచ్చదనం కూడా అదే నిష్పత్తిలో పెంచూతోంది తెలంగాణ ప్రభుత్వం.
యాదగిరిగుట్టను యాదాద్రిని అభివృద్ధి చేయడంతో ఇప్పుడు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. అయితే యాదాద్రి అభివృద్ధి కోసం పరిసర గ్రామాలలో పదేపదే భూసేకరణ చేస్తూ స్థానిక రైతులను రోడ్డున పడేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు భూసేకరణతో తీవ్రంగా నష్టపోయిన స్థానిక రైతులు, అవుటర్ రింగ్ రోడ్డు కోసం మరోసారి భూములు ఇవ్వాల్సివస్తుందని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కనుక యాదాద్రిని అభివృద్ధి చేసిన క్రెడిట్‌తో పాటు ఈ పాపం కూడా కేసీఆర్‌దే.