కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతున్నారా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటికీ 9 ఏళ్ళు పూర్తయ్యి పదో ఏడాదిలో అడుగుపెట్టింది. కనుక ఈ తొమ్మిదేళ్ళ ప్రస్థానం ఏవిదంగా సాగిందని  చూసుకోవాల్సిన సమయం ఇది. ఎన్నో ఉద్యమాలు, బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కళ్ళకు కనిపించేంతగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది. ప్రతిపక్షాలు దీనిని అంగీకరించకపోయినా ఇది వాస్తవం అని ప్రజలందరికీ తెలుసు. నీళ్ళు, నిధులు, నియమకాల కోసమే తెలంగాణ ఏర్పడింది కనుక ముందుగా వాటి గురించే చెప్పుకోవలసి ఉంటుంది.

నీళ్ళు: తెలంగాణ ఏర్పడక మునుపు త్రాగుసాగు నీటి కష్టాలు, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన నీటి వసతి గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పటి బీడుభూములలోనే నేడు మూడు పంటలు పండుతున్నాయి. ఇంటింటికీ త్రాగు నీరు లభిస్తోంది. చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భజలాలు పెరిగాయి. హరితహారం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెరిగింది.                       

నిధులు: బిజెపి, బిఆర్ఎస్‌ పార్టీల మద్య సాగుతున్న రాజకీయ ఆధిపత్యపోరు కారణంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య సఖ్యత లోపించడం తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిస్తోందని చెప్పక తప్పదు. అయితే కేసీఆర్‌, కేటీఆర్‌, మంత్రి హరీష్‌రావు తదితరుల దూరదృష్టి, నిబద్దత, కృషి కారణంగా తెలంగాణ రాష్ట్రం స్వయంసంవృద్ధి సాధించగలిగింది. కనుక కేంద్రం వివక్ష చూపుతున్నప్పటికీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పటిష్టంగానే ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలికవసతుల కల్పన, సంక్షేమ పధకాలపై ఖర్చు చేయగలుగుతోంది. కేసీఆర్‌ ప్రభుత్వం అప్పులు చేస్తుండటంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ, అభివృద్ధి కోసం చేసే అప్పులు పెట్టుబడిగానే చూడాలి. ఆ పెట్టుబడితోనే రాష్ట్రం స్వయంసంవృద్ధి సాధించగలిగిందని మరిచిపోకూడదు.

నియామకాలు: మంత్రి కేటీఆర్‌ చొరవ కారణంగా రాష్ట్రానికి అనేక ప్రైవేట్ పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు తరలివచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. వాటి ద్వారా లక్షలమందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తోంది. కనుక ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేయకుండా ఆలస్యం చేయడం వలన రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోందనే వాదన అర్ధరహితమనే చెప్పాలి. అయినప్పటికీ ప్రభుత్వం దాదాపు 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ప్రైవేట్ రంగంలో భారీగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్న కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఆ కారణంగా రియల్ ఎస్టేట్, హోటల్, రవాణా, వినోదం, పర్యాటకం తదితర రంగాలు కూడా అభివృద్ధి సాధిస్తున్నాయి.     

సంక్షేమ పధకాలు: గత ప్రాభుత్వాలు వీటిని మొక్కుబడిగా అమలు చేస్తూండేవి కనుక వాటి వలన ప్రభుత్వంపై ఆర్ధికభారమే తప్ప ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ కలిగేది కాదు. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం వివిద వర్గాల ప్రజల అవసరాలు, సమస్యలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పధకాలను రూపొందించి కట్టుదిట్టంగా అమలుచేస్తుండటం వలన వాటితో నిజంగానే ప్రజలు లబ్ధిపొందుతున్నారు. కనుక ప్రజల ఆకాంక్షల మేరకే కేసీఆర్‌ పాలన సాగుతున్నట్లు భావించవచ్చు.