అర్దరాత్రి ట్రక్కులో ప్రయాణించిన రాహుల్ గాంధీ!

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం అర్దరాత్రి ఢిల్లీ నుంచి ఛండీఘడ్ వరకు ఓ సరుకు రవాణా ట్రక్కులో ప్రయాణించారు. ట్రక్కు డ్రైవర్ల సమస్యలు స్వయంగా తెలుసుకొనేందుకు రాహుల్ గాంధీ ట్రక్కులో ప్రయాణించారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఆయన ట్రక్కులో ప్రయాణిస్తున్నప్పుడు తీసిన ఫోటోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విడుదల చేసింది. 

దేశవ్యాప్తంగా 90 లక్షల మంది ట్రక్కు డ్రైవర్లు నిత్యం దేశం నలుమూలలకి సరుకు రవాణా చేస్తుంటారు. కానీ వారి కష్టాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎవరికీ పట్టదు. ప్రజలందరి కష్టానష్టాలలో పాలుపంచుకోవాలని చూసే రాహుల్ గాంధీ ట్రక్కులో ప్రయాణిస్తూ తెలుసుకొన్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరే ముందు ఓ డాబా హోటల్‌లో భోజనాలు చేస్తున్న ట్రక్కు డ్రైవర్లతో రాహుల్ గాంధీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. రాహుల్ గాంధీ అంతటివాడు హటాత్తుగా తమ మద్యకు వచ్చి కూర్చొని తమ సమస్యల గురించి అడిగి తెలుసుకోవడానికి రావడంతో ట్రక్కు డ్రైవర్లు ఆనందంతో పొంగిపోయారు. 


ఆ తర్వాత రాహుల్ గాంధీ ట్రక్కులో ఢిల్లీ నుంచి సుమారు 90 కిమీ దూరం ట్రక్కులో ప్రయాణించి తెల్లవారుజామున 4.30 గంటలకు అంబాల నగరంలో గురుద్వారాను సందర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. 

కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీలో అందరూ చాలా హుషారుగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇదే ఊపులో రాహుల్ గాంధీ కూడా అర్దరాత్రి ట్రక్కులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.