తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరణ

జూన్ 2నాటికి  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ళు పూర్తవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సిఎం కేసీఆర్‌ సోమవారం సచివాలయంలో ఈ దశాబ్ది ఉత్సవాలను సూచించే లోగోను ఆవిష్కరించారు. లోగోలో ఈ పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని తెలియజేసే బొమ్మలను దానిలో ముద్రించారు. 1వ నంబరులో బతుకమ్మ, బోనాలు పండుగలను సూచించే బొమ్మలు, పద్మాకారంలో ఉండే సున్నా మద్యలో తెలంగాణ తల్లి బొమ్మను, చుట్టూ డా.అంబేడ్కర్‌ విగ్రహం, హైదరాబాద్‌ మెట్రో రైలు, యాదాద్రి, సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, ఉచిత విద్యుత్‌, మిషన్ భగీరధ, అమరవీరుల స్తూపం, తెలంగాణ సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ బొమ్మలను ముద్రించారు. ఈ పదేళ్ళలో జరిగిన అభివృద్ధిని అవి సూచిస్తున్నాయి. కుడివైపు పై భాగంలో రాష్ట్ర పక్షి పాలపిట్టను ముద్రించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని కేసీఆర్‌ సూచించారు. ఈ ఉత్సవాలలో తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల గురించి, ఈ పదేళ్ళలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పధకాల గురించి, తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలు, కవితా పఠనాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్‌ సూచించారు.