జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్)ల పోరాటం ఫలించింది. ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన జేపీఎస్‌లందరి ఉద్యోగాలు క్రమబద్దీకరణ చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. దీనికోసం విధివిధానాలు రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని కేసీఆర్ ఆదేశించారు.
ఈరోజు సచివాలయంలో సిఎం కేసీఆర్ ఈ సమస్యపై మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి లోతుగా చర్చించిన తర్వాత వారి ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని నిర్ణయించారు. అయితే జేపీఎస్‌ల పనితీరుపై జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తీసుకొని వాటి ఆధారంగా క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.
తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జేపీఎస్‌లు సమ్మె చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారిపట్ల కటువుగానే వ్యవహరించింది. నిర్ధిష్టగడువులోగా విధులలో చేరకపోతే అందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగిస్తామని తీవ్రంగా హెచ్చరించింది. కానీ వారు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పోరాటం కొనసాగించి విజయం సాధించారు.
రెండేళ్ల క్రితం టీఎస్‌ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేసినప్పుడూ కేసీఆర్ ఇలాగే కటువుగా వ్యవహరిస్తూ చివరికి వారందరినీ కాళ్ళ బేరానికి రప్పించుకొన్నారు. ఇప్పుడూ అలాగే కటువుగా వ్యవహరించినప్పటికీ, వెనక్కు తగ్గడం కాస్త ఆలోచింపజేస్తుంది. బహుశః ఎన్నికలు దగ్గర పడుతున్నందునే వారి డిమాండ్‌కు కేసీఆర్ తలొగ్గి ఉండవచ్చనే అభిప్రాయం వినపడుతోంది. ఇదే నిజమైతే రేపు మరిన్ని సమ్మెలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.