
తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాల తర్వాత ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ 8 ఏళ్ళలో బస్తీ దవాఖానాలు, మహిళా దవాఖానాలు, ఉచిత డయోగ్నిస్టిక్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, ప్రతీ జిల్లాలో వైద్య, నర్సింగ్ కళాశాలలు, వాటికి అనుబందంగా ప్రభుత్వాసుపత్రులు నిర్మించింది. ఇంకా హైదరాబాద్ నాలుగు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, వరంగల్ నగరంలో ఓ 22 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కనుక ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు లభిస్తుండటంతో పాటు రాష్ట్రంలో వైద్యఆరోగ్య రంగంలో ఉద్యోగావకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఈ ఒక్క రంగంలోనే 22,263 పోస్టులు భర్తీ చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. త్వరలో మరో 9,222 పోస్టులకు నోటిఫికేషన్స్ జారీ చేస్తామని చెప్పారు.
హైదరాబాద్, శిల్పకళావేదికలో ఆయన స్వయంగా కొత్తగా నియమితులైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఒకే ఏడాదిలో 9 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ఒక్కో కళాశాల మీద రూ.500 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నాము. వైద్య కళాశాలలు ఏర్పాటుతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రతీ లక్షమందికి 22 మంది చొప్పున మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే ఇన్ని మెడికల్ సీట్లు కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది,” అని అన్నారు.