అయ్యో! రోడ్డుపై నీటిలో మునిగి చనిపోయిందే!

బెంగళూరు నగరంలో ఓ ఆశ్చర్యకరమైన విషాద ఘటన జరిగింది. ప్రస్తుతం బెంగళూరులో ఎడతెరిపి లేకుండా జోరుగా వానలు కురుస్తున్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన భానురేఖ రెడ్డి (23) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆదివారం మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు కారులో చేరుకొంది. బెంగళూరులో కెఆర్ జంక్షన్‌ వద్ద గల అండర్ పాస్ రోడ్డులోకి వారి వాహనం ప్రవేశించినప్పుడు హటాత్తుగా వరదనీరు ముంచెత్తింది. దాంతో వారి కారు ఆ నీటిలో చిక్కుకుపోయింది. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు, నగర మునిసిపల్ సిబ్బంది వెంటనే వారినందరినీ ఆ కారులో నుంచి బయటకు తీసుకువచ్చి సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. వారిలో భానురేఖారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆమెకు ప్రధమ చికిత్స చేసి హాస్పిటల్‌ తరలిస్తుండగా దారిలోనే ఆమె చనిపోయింది! ఆమె బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తోంది. ఇటీవలే ఆ కంపెనీలో ఉద్యోగం సాధించడంతో తల్లితండ్రులతో కలిసి హైదరాబాద్‌ నుంచి కారులో బెంగళూరు వస్తుండగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.  

బెంగళూరు వంటి అభివృద్ధి చెందిన ఓ నగరంలో ఓఅండర్ పాస్ రోడ్డులో ఈ స్థాయిలో నీరు చేరడం దానిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం చాలా విచిత్రమే కాక చాలా బాధాకరం కూడా. ఈ విషయం తెలుసుకొన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెంటనే ఆమె కుటుంబ సభ్యులు చికిత్స పొందుతున్న సెయింట్ మార్దాస్ హాస్పిటల్‌కు చేరుకొని వారిని పరామర్శించి ఓదార్చారు. భానురేఖారెడ్డి మృతికి రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. 

నగర పోలీస్ కమీషనర్ ప్రతాప్ రెడ్డి ఆదేశం మేరకు పోలీసులు సంబందిత మున్సిపల్ అధికారులపై కేసు నమోదు చేశారు. వారి అజాగ్రత్త, వైఫల్యం కారణంగానే యువతి చనిపోయిందని కనుక ఆమె మరణానికి వారే బాధ్యత వహించాలని దానిలో పేర్కొన్నారు.