
కేంద్ర ప్రభుత్వం హటాత్తుగా రూ.2,000 నోట్లను మార్కెట్ నుండి ఉపసంహరించడంపి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, కొన్ని తప్పు పడుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి దీనిపై స్పందిస్తూ, “ఇది తప్పకుండా మరో పెద్ద కుట్ర అనే భావిస్తునాము. ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉండే కొన్ని వర్గాల కోసం, పెట్టుబడిదారులకు లబ్ధి కలిగించడం కోసమే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని మేము భావిస్తున్నాము. అసలు 2016లో పెద్దనోట్లు ఎందుకు రద్దు చేశారో మళ్ళీ అంతకంటే పెద్దనోట్లను ఎందుకు ముద్రించారో జవాబు చెప్పాలి. నల్లధనం అరికట్టడానికే పెద్దనోట్లు రద్దు చేశామని చెప్పుకొన్నారు కనుక ఎంత నల్లధనం వెలికివచ్చిందో చెప్పనేలేదు.
అప్పుడు ఈ రూ.2,000 నోట్లను ఎవరికోసం ముద్రించారో తెలీదు. మళ్ళీ ఇప్పుడు వాటిని ఎందుకు రద్దు చేస్తున్నారో తెలీదు. మోడీ ప్రభుత్వం దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రజల కోసం కాకుండా తనకు అనుకూలంగా ఉండే కొందరు పెట్టుబడిదారులకు వీలుగా నడిపిస్తున్నారని దీంతో అర్దమవుతోంది. ఈ నిర్ణయంతో కొందరు అజ్ఞాతవ్యక్తులకు లాభం కలుగుతుంది. ప్రజలకు ఎటువంటి లాభమూ ఉండదు. మోడీ ప్రభుత్వం దేశంలో సామాన్య ప్రజలు తిండిలేక ఒకపూట ఆకలితో ఉంటేనే మంచిదని, అప్పుడే అందరూ తన మాట వింటారని భావిస్తున్నారు. అందుకే మోడీకి సామాన్య ప్రజల కంటే కొందరు అజ్ఞాత స్నేహితులంటేనే మక్కువ ఎక్కువ. వారికి ఏదో ప్రయోజనం కలిగించడం కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నారని భావిస్తున్నాము,” అని అన్నారు.
రూ.2,000 నోట్లను ఎందుకు తెచ్చారో... ఎందుకు రద్దు చేశారో అన్నది దేశ ప్రజలకు మోడీ వివరణ ఇవ్వాలి. pic.twitter.com/sXsWb4QJlo
— Jagadish Reddy G (@jagadishBRS) May 20, 2023