ఈరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఖైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగబోతున్నాయి. ఎన్టీఆర్‌కి సంబందించి ఏ కార్యక్రమాలు జరిగిన మొదట గుర్తొచ్చేవి నందమూరి బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ పేర్లే.
అయితే ఈ ఉత్సవాలకి జూ.ఎన్టీఆర్ రాలేనని తెలియజేశారని ఉత్సవ కమిటీ సభ్యుడు వంశీ కాకా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకొనేందుకు ఇదివరకే అన్ని ఏర్పాట్లు చేసుకొన్నందున ఈ కార్యక్రమానికి రాలేననే విషయం జూ.ఎన్టీఆర్‌ని ఆహ్వానించినప్పుడే ఉత్సవ కమిటీకి తెలియజేశారని వంశీ కాకా తెలిపారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, దగ్గుబాటి వెంకటేష్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, అలనాటి అందాల నటి జయప్రద, బిజెపి సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు హాజరవుతున్నారు.
ఈ నెల 28న ఖమ్మంలో లకారం చెరువు మద్య ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూ.ఎన్టీఆర్ హాజరవుతున్నారు. కానీ ఈరోజు టిడిపి మద్దతుదారుల అధ్వర్యంలో కూకట్‌పల్లిలో జరుగబోయే ఈ కార్యక్రమానికి జూ.ఎన్టీఆర్ హాజరుకావడం లేదు. తద్వారా తాను నేటికీ టిడిపికి దూరంగానే ఉండాలనుకొంటున్నట్లు జూ.ఎన్టీఆర్ చెప్పకనే చెప్పారనుకోవచ్చు.
లకారం చెరువులో శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవడంతో స్టే విధించినందున, మద్యే మార్గంగా శ్రీకృష్ణుడి విగ్రహం చేతిలో పిల్లనగ్రోవిని, కిరీటంలో నెమలి పించాన్ని తొలగించి, మే 28న విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు సాయంత్రం జూ.ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగనుంది.