హైదరాబాద్‌కు అలియంట్ గ్రూప్... 9,000 ఉద్యోగాలు!

ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ బృందం ఇప్పటికే ‘వార్నర్ బ్రదర్స్-డిస్కవరీ’, ‘మెడ్‌ట్రానిక్స్‌’, ‘జాప్‌కామ్ గ్రూప్’ సంస్థలను హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. తాజాగా హ్యూస్టన్‌లో ‘అలియంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు’ సీఈవో ధవళ్ జాదవ్‌, ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యి హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. అలియంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బ్యాంకింగ్, అకౌంటింగ్, టాక్సింగ్, ఆడిటింగ్, ఐ‌టి సర్వీసస్, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో సేవలు అందిస్తుంటుంది. కనుక దీనిలో ఉద్యోగావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్‌లో ఏర్పాటుకాబోయే ఈ ‘అలియంట్ గ్రూప్’ సంస్థలోనే 9,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది! 

మంత్రి కేటీఆర్‌ ఈ విషయం తెలియజేస్తూ ట్విట్టర్‌లో ఆ సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశం ఫోటోలను షేర్ చేస్తూ, పైన పేర్కొన్న రంగాలలో యువతకు అలియంట్ గ్రూప్‌లో అద్భుతమైన ఉద్యోగావకాశాలు లభించబోతునందుకు సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు. అలియంట్ గ్రూప్ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టి, తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు అంగీకరించడం ద్వారా తెలంగాణలో బిఎఫ్ఎస్ఐ రంగంపై మరింత నమ్మకం ఏర్పడిందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.