కవిత అరెస్టుకు రాష్ట్ర బిజెపి నేతలు ఒత్తిడి చేస్తున్నారా?

కర్ణాటకలో ఓటమి ప్రభావం బిజెపిపై బాగానే పడిన్నట్లుంది. ఇంతకాలం తెలంగాణ బిజెపి నేతల అభిప్రాయాలను వినేందుకు పెద్దగా ఆసక్తి చూపని బిజెపి అధిష్టానం, ముఖ్యనేతలందరినీ ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడుతోంది. అయితే రాష్ట్ర బిజెపి నేతలు మీడియాతో మాట్లాడుతున్న దానిని బట్టి రెండు అంశాలపై వారు తమ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు అర్దమవుతోంది. 

1. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చడం. 2. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని అరెస్ట్‌ చేయించడం. 

కేసీఆర్‌ను గద్దె దించడమే తన ఏకైక లక్ష్యమని చెపుతూ బిజెపిలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “బిజెపి-బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే కాంగ్రెస్‌ ప్రచారం కారణంగా ప్రజలు, పార్టీలోకి రావాలనుకొంటున్న నేతలు కూడా బిజెపిపై నమ్మకం కోల్పోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ అవుతారని మా రాష్ట్ర బిజెపి నేతలు చెప్పుకొన్నారు. కానీ ఇంతవరకు ఆమెను అరెస్ట్ చేయకపోవడంతో మా రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే అనుమానాలు ఏర్పడ్డాయి. 

ప్రజలకు, కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్నశక్తులకు బిజెపి గురించి  ఇటువంటి అనుమానాలు ఉన్నందునే తెలంగాణలో  బలపడలేకపోతున్నామని భావిస్తున్నాను. కనుక బిఆర్ఎస్‌తో మా పార్టీకి ఎటువంటి రహస్య అవగాహన లేదని నిరూపించుకొనేందుకు కల్వకుంట్ల కవితని వెంటనే అరెస్ట్‌ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాను,” అని అన్నారు.

ఇక బిజెపి చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఇటీవల ఖమ్మం వెళ్ళి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి బిజెపిలో చేరవలసిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కానీ ఆయన ఏమి చెప్పారో తెలీదు కానీ ఆ తర్వాత పొంగులేటి సొంత పార్టీ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి వంటివారు పార్టీలోకి వచ్చేందుకు ఎందుకు సంకోచిస్తున్నారు?అంటే కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి చెప్పిన కారణమే కనిపిస్తోంది. రెండోది బండి సంజయ్‌ ఏకపక్ష వైఖరి మరో కారణంగా కనిపిస్తోంది. ఈటల రాజేందర్‌ అందరినీ కలుపుకుపోతారు కనుక పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించాలని బిజెపి అధిష్టానం భావిస్తోందేమో?త్వరలోనే తెలంగాణ రాజకీయాలలో ఖచ్చితంగా ఏదో సంచలనం జరుగబోతోందని మాత్రం భావించవచ్చు.