బిఆర్ఎస్ జాతీయ రాజకీయాలలో భాగంగా మొదట మహారాష్ట్రలో విస్తరించేందుకు సిఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ రాష్ట్రంలో నాందేడ్ జిల్లాలో నిర్వహిస్తున్న పార్టీ శిక్షణా కార్యక్రమానికి కేసీఆర్ నిన్న వెళ్ళి వచ్చారు కూడా. సరిగ్గా ఇదే సమయంలో బిఆర్ఎస్‌కు చిన్న శుభవార్త వచ్చింది.
ఔరంగాబాద్ జిల్లా, గంగాపూర్ తాలూకాలోని అంబేలోహాల్ గ్రామపంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్ధి గఫూర్ సర్దార్ పఠాన్ ఒకటో వార్డు సభ్యుడుగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలలో అవలీలగా అభ్యర్ధులను గెలిపించుకోగల బిఆర్ఎస్ పార్టీకి ఇచ్చి చాలా చిన్న విజయమే అయినప్పటికీ పొరుగు రాష్ట్రంలో ఇది తొలి విజయం కనుక ఆ పార్టీకి ఇది చాలా సంతోషకరమైన వార్తే అని భావించవచ్చు.
నాందేడ్‌లో నిన్న జరిగిన బిఆర్ఎస్ శిక్షణా శిబిరంలో మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల నుంచి పార్టీ సమన్వయకర్తలు, వివిద కమిటీల ఛైర్మన్లు, ముఖ్య నేతలు కలిపి 1500 మందికి పైగా హాజరయ్యారు. కేసీఆర్ వారిని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, తెలంగాణ ఏర్పడక మునుపు ఉన్న పరిస్థితులను ఇప్పుడున్న పరిస్థితులను వివరించి, మహారాష్ట్రలో కూడా ఇటువంటి మార్పు రావలసిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో సాధ్యమైనది మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. మహారాష్ట్రలోనే కృష్ణా, గోదావరి నదులు ఇతర రాష్ట్రాలకు పారుతున్నాయని, దిగువ రాష్ట్రాలలో సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోగలిగినప్పుడు మహారాష్ట్రను పాలించిన ఏ ప్రభుత్వమూ ఎందుకు కట్టలేదని కేసీఆర్ ప్రశ్నించారు.
ప్రతీసారి ఎవరినో గెలిపించడం కోసం మీరందరూ ఓట్లు వేస్తున్నారని ఈసారి మిమ్మల్ని మీరే గెలిపించుకొనేందుకు ఓట్లు వేసుకోవాలని కేసీఆర్ వారికి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఔరంగాబాద్, నాగపూర్ బిఆర్ఎస్ పార్టీ శాస్విత కార్యాలయాలు నిర్మించుకొని వచ్చే ఎన్నికలలో మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలలో పోటీ చేసి గెలుస్తామని కేసీఆర్ వారికి చెప్పారు. మహారాష్ట్ర రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకే బిఆర్ఎస్ పార్టీ వచ్చిందని కేసీఆర్ అన్నారు. కనుక బిఆర్ఎస్ పార్టీకి మరాఠీ ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.