మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా నేటి నుంచి రెండు రోజులపాటు నాందేడ్‌లో శిక్షణాశిబిరం నిర్వహిస్తోంది. తెలంగాణ వెలుపల జరుగుతున్న తొలి బిఆర్ఎస్ శిక్షణా కార్యక్రమం కావడంతో దీనిని ప్రారంభించేందుకు బిఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ నాందేడ్ బయలుదేరి వెళుతున్నారు. నాందేడ్‌లోని అనంత్ లాన్స్‌లో ఈ శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాందేడ్ పట్టణం అంతటా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. నాందేడ్ విమానాశ్రయం వద్ద కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ దారి పొడవునా ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్, బిఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ సింగ్ నాందేడ్‌లో బస చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు ఇప్పటికే బిఆర్ఎస్ కన్వీనర్లు, సమన్వయకర్తలను నియమించుకొన్నందున అన్ని నియోజకవర్గాల నుంచి బిఆర్ఎస్ నేతలను ఈ శిక్షణా కార్యక్రమానికి ఆహ్వానాలు పంపించారు. కేసీఆర్ వారికి మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ ఏవిదంగా ముందుకు సాగాలో దిశానిర్దేశం చేస్తారు.
రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ ప్రచార సామాగ్రిని, మహారాష్ట్ర జానపద, సాహిత్య, సంగీత కళారూపాలకు సంబందించిన సమాచారం లోడ్ చేసిన పెన్ డ్రైవ్‌లను బహుమతిగా అందజేస్తారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా నాందేడ్‌లో పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. నిన్ననే నాందేడ్ పోలీసులు కేసీఆర్ కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.