ఖమ్మం లకారం చెరువు ట్యాంక్‌బండ్ వద్ద శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విగ్రహావిష్కరణ చేయవద్దని సూచించింది.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకొని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా అసోసియేషన్ సహాయసహకారాలతో శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని లకారం చెరువు ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసేందుకు అన్నీ సిద్దం చేసుకొన్నారు. నిజామాబాద్‌కు చెందిన వర్మ అనే శిల్పకారుడు ఈ విగ్రహాన్ని అత్యద్భుతంగా తయారు చేశారు. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ మనుమడు, ప్రముఖ నటుడు జూ.ఎన్టీఆర్ చేతుల మీదుగా లకారం చెరువులో విగ్రహావిష్కరణకు మంత్రి పువ్వాడ అన్ని ఏర్పాట్లు చేశారు.
కానీ నటి కరాటే కళ్యాణితో సహా పలు హిందూ సంఘాలు, యాదవ సంఘాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో 14 పిటిషన్లు వేశాయి. త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నందున, కమ్మ, యాదవ సామాజికవర్గం ఓటర్లను బిఆర్ఎస్ పార్టీ ఆకర్షించేందుకే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారుచేయించి ఆవిష్కరిస్తున్నారని వాదించారు. ఎన్టీఆర్ అంటే తమకు చాలా గౌరవం ఉందని, కనుక కావాలనుకొంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని లేదా శ్రీకృష్ణుడు విగ్రహం ఏర్పాటు చేసుకొంటే మాకు అభ్యంతరం లేదు కానీ రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని పిటిషనర్లు వాదించారు. హైకోర్టు వారి వాదనలతో ఏకీభవిస్తూ, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయవద్దని ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయవలసిందిగా మంత్రి పువ్వాడను, జిల్లా అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.