కేంద్రన్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుని ఆ శాఖ నుంచి తప్పించి అంతగా ప్రాధ్యాన్యంలేని భూగర్భవిజ్ఞానశాస్త్రశాఖకు పంపించేశారు ప్రధాని నరేంద్రమోడీ. ఆయన సుప్రీంకోర్టు కొలీజియమ్ వ్యవస్థపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో మోడీ ప్రభుత్వానికి అటు సుప్రీంకోర్టు, న్యాయవాదుల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవలసివస్తోంది. అందుకే ఆయనను కీలకమైన న్యాయశాఖ నుంచి తప్పించి భూవిజ్ఞానశాస్త్రశాఖకు పంపించేశారని అర్దమవుతూనే ఉంది. అయితే ఆయన శాఖ బదిలీపై కూడా కాంగ్రెస్ పార్టీ ఘాటుగానే స్పందించింది. కాంగ్రెస్ ఎంపీలు కపిల్ సిబాల్, మానిక్కం ఠాగూర్ స్పందిస్తూ, “ఈ ఫెయిల్డ్ లా మినిస్టర్ కిరణ్ రిజిజు భూగర్భవిజ్ఞానశాస్త్రశాఖలో మాత్రం ఏం చేయగలరు?” అని విమర్శించారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కిరణ్ రిజిజు, వరుసగా మూడుసార్లు లోక్సభకు ఎన్నికవడంతో 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు కీలకమైన యువజన వ్యవహారాలు, క్రీడలు, హోమ్ శాఖ సహాయమంత్రి పదవులు ఇచ్చారు. వాటిలో ఆయన తన సమర్దత నిరూపించుకోవడంతో రెండోసారి కీలకమైన న్యాయశాఖకు మంత్రిగా నియమించారు. మొదటిసారి రాణించిన కిరణ్ రిజిజు, రెండోసారి నోటి దురద వలన కీలకమైన మంత్రి పదవిని పోగొట్టుకొన్నారు.