కర్ణాటక సిఎంగా సిద్దరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. చివరి నిమిషం వరకు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించిన కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్‌కు నిరాశే మిగిలింది. నిన్న మధ్యాహ్నం నుంచి అర్దరాత్రి వరకు కాంగ్రెస్ పెద్దలు ఆయనను బుజ్జగించి, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం డికె శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి, మరికొన్ని కీలక మంత్రిపదవులతో సర్దుకుపోయేందుకు ఒప్పించారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోయింది. మరికొద్ది సేపటిలో కాంగ్రెస్ అధిష్టానం అధికారిక ప్రకటన చేయనుంది.
ఈరోజు సాయంత్రం 7 గంటలకు బెంగళూరులోని ఇందిరాగాంధీ భవన్‌లో డికె శివకుమార్ అధ్యక్షతన కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సమావేశమయ్యి, సిద్దరామయ్యను తమ శాసనసభపక్ష నాయకుడుగా ఎన్నుకొంటారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా డికె శివకుమార్ ఇప్పటికే పార్టీలో అందరికీ సందేశాలు పంపించిన్నట్లు సమాచారం.
ఈరోజు సాయంత్రం లాంఛనంగా ఈ కార్యక్రమం పూర్తయితే, వెంటనే సిద్దరామయ్య, డికె శివకుమార్, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాజ్‌భవన్‌కు వెళ్ళి ప్రభుత్వ ఏర్పాటుకి తమ సంసిద్దతను తెలియజేస్తారు. మే 20న బెంగళూరులో కంఠీరవ స్టేడియంలో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డికె శివకుమార్ ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులతో పాటు పిసిసి అధ్యక్షుడుగా కూడా కొనసాగనున్నారని తెలుస్తోంది.