కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిన్నట్లు వార్తలు రావడంతో, ఈరోజు ఉదయం నుంచి బెంగళూరులో ఆయన నివాసం వద్దకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. మరోపక్క బెంగళూరులో కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం కార్యక్రమానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఇవాళ్ళ మధ్యాహ్నం 3.30 గంటలకు కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి పేరు ఇంకా ఖరారు చేయలేదు. కనుక పుకార్లు నమ్మవద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ మరో రెండు-మూడు రోజులలో కాంగ్రెస్ మంత్రివర్గం కొలువుతీరుతుందని చెప్పగలను,” అని అన్నారు.
కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివరామయ్య మొదట ముఖ్యమంత్రి పదవికి పోటీ పడినప్పటికీ, తర్వాత పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతానని, ఎవరిని ముఖ్యమంత్రిగా నియమిస్తే వారికి సహకరిస్తానని, పార్టీకి వెన్నుపోటు పొడవనని మీడియాకు చెప్పారు.
కానీ నేడు ఢిల్లీలో సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గేలను కలిసినప్పుడు ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. చెరో రెండున్నరేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగాలనే కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదనను కూడా ఆయన తిరస్కరించిన్నట్లు తెలుస్తోంది. శివకుమార్ ముఖ్యమంత్రి పదవికి పట్టుబడుతుండటం వలననే ప్రకటన ఆలస్యమవుతోందని లేకుంటే సిద్దరామయ్య పేరును ఈరోజు మధ్యాహ్నమే ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది.
కాంగ్రెస్ అధిష్టానంతో సిద్దరామయ్య చర్యలు ముగిసినందున ఆయన మరికొద్ది సేపటిలో బెంగళూరుకి తిరుగు ప్రయాణం కానున్నారు. కానీ శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవికి చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తుండటంతో ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. బహుశః బుదవారం రాత్రి లేదా గురువారం మధ్యాహ్నంలోగా ముఖ్యమంత్రి పేరు ప్రకటించే అవకాశం ఉంది.