
కేంద్రప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి ఈనెల 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేయబోతునట్లు తాజా సమాచారం. ఆయన 2014 మే 26వ తేదీన తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కనుక అదే రోజున కొత్త పార్లమెంట్ భవనానికి ప్రారంభోత్సవం చేయవచ్చని తెలుస్తోంది.
ప్రధాని మోడీ 2020, డిసెంబర్‌లో దీనికి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.970 కోట్లు వ్యయంతో దీనిని నిర్మించారు. దేశానికే గర్వకారణంగా నిలువబోతున్న ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ సంస్థ నిర్మించింది.
సుమారు 64,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో త్రిభుజాకారంలో నిర్మించిన ఈ పార్లమెంట్ భవనంలో నాలుగు అంతస్తులు ఉంటాయి. భవిష్యత్ అవసరాలకు సరిపడేవిదంగా, సకల అత్యాధునిక సదుపాయాలు, సాకెంతిక పరిజ్ఞానంతో దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఒకేసారి 1,224 మంది ఎంపీలతో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనానికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, ఖర్మ ద్వార్ అనే మూడు ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఒక ద్వారం గుండా ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి (రాజ్యసభ ఛైర్మన్), లోక్‌సభ స్పీకర్, డెప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రులు, వీవీఐపీలు లోనికి ప్రవేశిస్తారు. మరో ద్వారం గుండా ఎంపీలు, అతిధులు ప్రవేశిస్తారు. మరో ద్వారం పార్లమెంట్ నిర్వహణ అధికారులు, సిబ్బంది, మీడియా తదితరులకు వినియోగిస్తారు.
ఈ నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు గత ఏడాదిలోనే పూర్తి కావలసి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. కానీ ఇంకా తుదిమెరుగులు దిద్దాల్సి ఉన్నందున దీనిని ఈ నెల ప్రారంభోత్సవం చేసినప్పటికీ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు దీనిలో నిర్వహించలేకపోవచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో ఇది అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.