9.jpg)
ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పుడు అత్యవసరంగా కేసీఆర్ ఎందుకు సమావేశం నిర్వహిస్తున్నారో అని పార్టీలో అందరూ గుసగుసలాడుకొంటుండగా, రేపు (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సచివాలయంలో తొలిసారిగా మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నట్లు మంత్రులకు సమాచారం అందింది.
తెలంగాణ శాసనసభకు ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఎన్నికలు జరుగుతాయి. కనుక అక్టోబర్‌లోగా ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవగానే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎటువంటి పధకాలు ప్రకటించలేదు. కొత్తగా శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు చేపట్టలేదు. కలక్టర్లు, ఎస్పీ, డీఎస్పీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరుల బదిలీలు చేయలేదు. కనుక వాటిపై నేడు పార్టీ సమావేశంలో చర్చించి, ఆ ప్రతిపాదనలన్నిటికీ రేపు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించవచ్చు.
ఇదీగాక, పార్టీలో కొందరు ఎమ్మెల్యేల పనితీరు, ప్రవర్తన పట్ల సిఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. బహుశః ఈరోజు సమావేశంలో వారికి మళ్ళీ టికెట్లు ఇచ్చేది లేనిదీ తేల్చేసినా ఆశ్చర్యం లేదు. ఈసారి ఎన్నికలలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్స్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించినప్పటికీ బిఆర్ఎస్‌లో అనేకమంది టికెట్లు ఆశిస్తున్నారు. దీనిపై కూడా నేడు చర్చ జరుగవచ్చు. కనుక ఈరోజు, రేపు జరుగబోయే సమావేశాలు చాలా కీలకమైనవిగా భావించవచ్చు.