కర్ణాటకలో బిజెపిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది. అయితే కాంగ్రెస్‌ను గెలిపించడంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్, మాజీ సిఎం సిద్దరామయ్య ఇద్దరి కృషి చాలానే ఉంది. కనుక ఇద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొన్నాక సిద్దరామయ్య వైపు మొగ్గు చూపుతున్నట్లు తాజా సమాచారం. కనుక శివకుమార్ అసంతృప్తి చెందడం, దాంతో పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. కనుక, శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో సహా కీలకమైన పదవులు ఇచ్చి బుజ్జగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అందుకు ఆయన అంగీకరించకపోతే రెండున్నరేళ్ళు ఆయన, మిగిలిన రెండున్నరేళ్ళు సిద్దరామయ్య ముఖ్యమంత్రులుగా చేసేందుకు ఒప్పించాలనే కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి సిద్దరామయ్య, శివకుమార్ ఇద్దరూ నిన్ననే ఢిల్లీ వెళ్ళవలసి ఉండగా, చివరి నిమిషంలో శివకుమార్ తన పర్యటనను రద్దు చేసుకొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు నాతోనే ఉన్నారు. నా నాయకత్వాన్నే కోరుకొంటున్నారు,” అని చెప్పారు. తద్వారా ముఖ్యమంత్రి పదవి తనకే దక్కాలని స్పష్టంగా చెప్పారు.
ఈ వ్యవహారాన్ని ఎక్కువ రోజులు సాగదీస్తే కాంగ్రెస్ పార్టీకి మొదటికే మోసం వస్తుంది. శివకుమార్‌కు బిజెపి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలువునా చీల్చే ప్రమాదం పొంచి ఉంది. కనుక ఈరోజు శివకుమార్‌ను కూడా ఢిల్లీకి పిలిపించుకొని బుజ్జగించబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు సాయంత్రంలోగా కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చేయవచ్చు.