మళ్ళీ అత్యవసర సమావేశం... దేనికో

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. 

ప్రస్తుతం పార్లమెంట్ లేదా శాసనసభ సమావేశాలు జరుగడం లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదని కేసీఆర్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. కనుక ఇప్పుడు అత్యవసరంగా ఈ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారో తెలియవలసి ఉంది. 

బహుశః కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, ఈ ఏడాది చివరిలోగా జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలపై దాని ప్రభావం గురించి చర్చించి, పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల పనితీరు బాగోకపోతే కర్ణాటకలో బీజేపిలాగే తెలంగాణలో బిఆర్ఎస్‌ పార్టీ కూడా ఓడిపోయే ప్రమాదం ఉంటుందని అందరినీ గట్టిగా హెచ్చరించవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబందు పధకంలో కొందరు ఎమ్మెల్యేలు కమీషన్లు గుంజుతున్నారని, వారందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని, తీరు మార్చుకోకుంటే తోకలు కత్తిరించేస్తానని గత సమావేశంలో సిఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. కనుక ఈ సమావేశంలో అటువంటివారిని మరోసారి గట్టిగా హెచ్చరించే అవకాశం ఉంది. 

జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులపాటు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించి, వాటిలో ఈ 9 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి, వివిధ కళారూపాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. కనుక వాటి గురించి కూడా ఈ సమావేశంలో అందరికీ తగు సూచనలు చేసే అవకాశం ఉంది.