జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాలు


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఈ జూన్ 2నాటికి 9 ఏళ్ళు పూర్తవుతుండటంతో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 21రోజుల పాటు రాష్ట్రావతరణ దినోత్సవాలు జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజున రాష్ట్ర సచివాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. అదే రోజున అన్ని జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. తొలిరోజున రాజధాని హైదరాబాద్‌తో సహా అన్నీ జిల్లాలలో అమరవీరుల స్థూపాల వద్ద నివాళులు ఆర్పిస్తారు. అమరవీరులకు పోలీసులు తుపాకులతో గౌరవవందనం సమర్పిస్తారు. 

ఆ మరుసటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళా ప్రదర్శనాలు, కవి సమ్మేళనాలు, ఆటపాటలు,  ప్రతిభకనబరిచిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సన్మానాలు, అవార్డులు అందజేయడం, తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాల గురించి, తెలంగాణ ఏర్పడక మునుపు ఆ తర్వాత ఈ 9 ఏళ్ళలో జరిగిన రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పధకాలను ప్రజలకు వివరిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీల ప్రదర్శనలు,  ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజులపాటు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాల నిర్వహణకు సీఎస్ శాంతి కుమారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా కలక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.