తెలంగాణ నుంచి బియ్యం కొనుగోలుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్‌

తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మద్య నెలకొన్న అనేక వివాదాలు, ప్రతిష్టంబనలలో రాష్ట్రం నుంచి ‘బాయిల్డ్ రైస్’ కొనుగోలు వ్యవహారం కూడా ఒకటి. బాయిల్డ్ రైస్‌కు దేశంలో రెండు మూడు రాష్ట్రాలలో తప్ప మరెక్కడా డిమాండ్‌ లేనందున ఆ బియ్యం పండించవద్దని, ఒకవేళ పండించినా కొనుగోలుచేయలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. దాంతో బిజెపి, బిఆర్ఎస్ పార్టీల మద్య పెద్ద యుద్ధమే జరిగింది. 

అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి 2021-22 (రబీ), 2022-23 (ఖరీఫ్‌) పంట కాలాలకు సంబంధించి మొత్తం 13.73 లక్షల మెట్రిక్‌ టన్నుల పారా బాయిల్డ్‌ రైస్‌ సేకరణకు అంగీకారం తెలిపినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అందించలేకపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతులను దృష్టిలో పెట్టుకొని తాను కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖ వ్రాసి అభ్యర్ధించగా ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించారని కిషన్‌రెడ్డి చెప్పారు. 13.76 లక్షల టన్నులు బియ్యం సేకరణ చేయగలిగితే, అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు కిషన్ రెడ్డి. సిఎం కేసీఆర్‌ ఎల్లప్పుడూ రాజకీయాల గురించే ఆలోచిస్తూ ఆ కోణంలోనే నిర్ణయాలు తీసుకొంటారని, దాని వలన మద్యలో రైతులు నష్టపోతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కనుక తెలంగాణ ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని రైతుల నుంచి పారా బాయిల్డ్ రైస్ సేకరించి కేంద్రానికి అందించాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.