అయ్యో.. చేతిలో డబ్బులేక ఓడిపోతున్నామే: కుమారస్వామి ఆక్రోశం!

ఈసారి కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్‌, జెడిఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌ అండగా నిలబడితే అధికార బిజెపి, కాంగ్రెస్‌ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొని గెలవగలమని కుమారస్వామి చాలా ధీమాగా ఉండేవారు. కానీ కలిసి పోటీ చేయలేదు. జెడిఎస్ తరపున కేసీఆర్‌ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళలేదు. కనీసం ఆర్ధికసాయం కూడా చేయలేదని కుమారస్వామి తాజా వ్యాఖ్యలతో స్పష్టం చేశారు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి కేసీఆర్‌ కర్ణాటకవైపు తొంగి చూడలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

మొన్న పోలింగ్ ప్రక్రియ పూర్తవగానే కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ, “ మేము గతంలో అనేక ఎన్నికలను ఎదుర్కొన్నాము. కొంతకాలం అధికారంలో కూడా ఉన్నాము. కనుక ఈసారి తప్పకుండా గెలుస్తామనుకొన్నాము. కానీ ఈసారి ఎన్నికల సమయంలో మా చేతిలో తగినంత డబ్బు లేకపోవడంతో మేము సులువుగా గెలుచుకోగలిగిన 25 సీట్లను చేజార్చుకొన్నాము. అక్కడ బలమైన అభ్యర్ధులను నిలబెట్టినప్పటికీ పార్టీ పరంగా వారికి ఆర్ధికసాయం చేయలేకపోయాము. మాకు ప్రజల నుంచి, బయటనుంచి కూడా ఆర్ధికసాయం లభిస్తుందని చివరి నిమిషం వరకు ఆశగా ఎదురుచూశాము కానీ అందకపోవడంతో గెలుచుకోగల సీట్లను ప్రత్యర్ధులకు ధారపోయాల్సి వస్తోంది,” అని కుమారస్వామి అన్నారు.

కర్ణాటక ఫలితాలు మే 13న (శనివారం) వెలువడతాయి. ఈసారి కాంగ్రెస్‌, బిజెపిలు రెంటికీ సరిసమానంగా సీట్లు రావచ్చని కనుక హంగ్ ఏర్పడే అవకాశం ఉందని సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి. కనుక అధికారం చేపడతామనుకొన్న జెడిఎస్ పార్టీ మూడో స్థానంలో మిగిలిపోయి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అధికారంలో భాగస్వామి కావాలని భావిస్తోంది.