
తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జెపిఎస్‌లు) తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ పదిరోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే వారు ఇటువంటి సంఘాలు ఏర్పాటుచేసుకోబోమని, వాటితో ఎటువంటి డిమాండ్స్ చేయబోమని, ఒకవేళ చేస్తే తక్షణం ఉద్యోగాలలో నుంచి తొలగించవచ్చనే షరతుకి అంగీకరిస్తూ, బాండ్ పేపర్స్ మీద సంతకాలు చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి గుర్తుచేశారు.
సిఎం కేసీఆర్‌కు వారిపై సదాభిప్రాయమే ఉందని కనుక తక్షణం సమ్మె విరమించి విధులలో చేరాలని సూచించారు. ప్రతిపక్షాల ప్రోద్బలంతో జెపిఎస్‌లు సమ్మె కొనసాగిస్తే వారే నష్టపోతారని హెచ్చరించారు. జెపిఎస్‌లు సమ్మె చేసి ప్రభుత్వాన్ని లొంగదీసుకోగలమని భావిస్తే వారికే నష్టమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. కొందరు జెపిఎస్‌లు తనకు ఫోన్లు చేసి తమ గోడు చెప్పుకొంటే విని సమ్మె విరమించి విదులలో చేరాలని సూచించాను తప్ప ఎవరినీ చర్చలకు రమ్మనమని ఆహ్వానించలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
కాంగ్రెస్, బిజెపిలు వారికి సంఘీభావం ప్రకటిస్తుండగా, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా వారికి సంఘీభావం ప్రకటించారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “జెపిఎస్‌ల చేత రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకొంటోంది. కనుక వారు తమకు న్యాయం చేయాలని కోరుతుంటే, మంత్రులు వారిని బెదిరించి భయపెట్టాలని ప్రయత్నిస్తుండటం చాలా శోచనీయం. ప్రభుత్వం కోసం పనిచేస్తున్నవారిని గౌరవించాలి కానీ వారికి ప్రభుత్వమే డెడ్‌లైన్లు పెడుతూ ఆలోగా సమ్మె విరమించకపోతే ఉద్యోగాలలో నుంచి పీకేస్తామని బెదిరించడం చాలా దారుణం. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ బెదిరింపులు మానుకొని వారి ఉద్యోగాలు క్రమబద్దీకరించి వారిని గౌరవంగా చూడాలని డిమాండ్ చేస్తున్నాను. జెపిఎస్‌ల పోరాటానికి టీజెఎస్ అండగా ఉంటుంది,” అని అన్నారు.