ప్రముఖ నటుడు సుమన్ బుదవారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో కాపునాడు నేత శ్రీనివాస తాతాజీ ఇంట్లో జరిగిన జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ, “నేను మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తాను. త్వరలోనే దీనిపై నిర్ధిష్టమైన ప్రకటన చేస్తాను. ఏపీలో జనసేన, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీలకే నా మద్దతు. ప్రకృతి విపత్తులు ఏటా సంభవిస్తూనే ఉంటాయి. వాటిలో అన్నదాతలు నష్టపోతూనే ఉంటారు. కనుక వారికి సాయపడేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. రైతులు కన్నీరు పెట్టకముందే ప్రభుత్వాలు వారికి సాయపడాలి. రైతులు సంతోషంగా ఉంటేనే దేశం కూడా బాగుంటుంది,” అని సుమన్ అన్నారు.
సుమన్ 1999లోనే టిడిపికి మద్దతు పలికారు. ఆ తర్వాత 2004లో బిజెపిలో చేరారు. కానీ దానిలోనూ ఇమడలేక ఆ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు జనసేన పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తప్పకుండా ఏదో ఓ రోజు ఏపీకికి ముఖ్యమంత్రి అవుతారని చెపుతుండటం, ఇప్పుడు కాపునాడు నేత ఇంటివద్ద విలేఖరుల సమావేశంలో మళ్ళీ రాజకీయాలలో వస్తానని చెప్పడం అదే సూచిస్తోంది.