17.jpg)
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఆరుగురు ఉగ్రవాదులలో ఒకరితో అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి సంబందం ఉందని ఆరోపించారు. ఆ పట్టుబడ్డ ఉగ్రవాది ఓవైసీ కుటుంబానికి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో హెచ్‌ఓడీగా పనిచేస్తున్నాడని బండి సంజయ్ అన్నారు. గతంలో కూడా ఉగ్రవాదులు పట్టుబడినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వారికి న్యాయసహాయం అందించారని బండి సంజయ్ ఆరోపించారు.
ఇంతవరకు ముస్లిం యువకులే ఉగ్రవాదంవైపు వెళుతుండేవారని కానీ తొలిసారిగా హిందూ యువకులను మతమార్పిడి చేసి ఇస్లాం మతంలో చేర్చుకొని అనంతగిరి కొండల్లో ఉగ్రవాదులుగా శిక్షణ ఇస్తున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కానీ కేసీఆర్ ఓవైసీలకు భయపడి చూసిచూడనట్లు వదిలేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో తరచూ ఉగ్రవాదులు పట్టుబడుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, బిఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం మజ్లీస్‌తో దోస్తీ నిబాయించేందుకు పోలీసులను కూడా స్వేచ్ఛగా పనిచేసుకోకుండా నియంత్రిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీపై కూడా బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఆయన రోహ్యింగాలకు ఆశ్రయం కల్పించారని బండి సంజయ్ అన్నారు. ప్రాజెక్టులలో అక్రమంగా పోగేసుకొన్న వేలకోట్ల సొమ్మును కాపాడుకొనేందుకే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌ను మళ్ళీ తన సలహాదారుగా కేసీఆర్ తెచ్చిపెట్టుకొన్నారని బండి సంజయ్ ఆరోపించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిని ఉద్యోగాలలో నుంచి తొలగించేస్తామని బెదిరిస్తూ వారి పోరాటాన్ని విచ్ఛిన్నం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కానీ వారి పోరాటానికి బిజెపి మద్దతు ఇస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.