
దేశంలో తొమ్మిది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు, ఆ తర్వాత 2024 మార్చిలోగా జరిగే లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుతం కర్ణాటక శాసనసభకు పోలింగ్ జరుగుతుండగా ఈ ఏడాది చివరిలోగా తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం శాసనసభలకు ఎన్నికలు నిర్వహించవలసి ఉంది. ప్రస్తుత లోక్‌సభ గడువు 2024, జూన్ 16తో ముగియనుంది. కనుక లోక్‌సభ ఎన్నికలతో పాటు పైన పేర్కొన్న 8 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ సిద్దం అవుతోంది.
ముందుగా తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్న రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తు కోసం జూలై 17 తర్వాత దరఖాస్తు చేసుకోవాలని కోరింది. మిగిలిన రాష్ట్రాల శాసనసభ, లోక్‌సభ ఎన్నికల కోసం డిసెంబర్ 17 తర్వాత దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
తెలంగాణ శాసనసభ గడువు 2024, జనవరి 16న, ఆంధ్రప్రదేశ్ శాసనసభ గడువు 2024, జూన్ 11న ముగియనున్నాయి. కనుక ఆ గడువుకు కనీసం 15-20 రోజుల ముందుగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. టిఆర్ఎస్.. బిఆర్ఎస్ పార్టీగా మారింది. దాని జండా కూడా మారింది. కనుక ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీగా పోటీ చేయబోతోంది. అయితే బిఆర్ఎస్‌కు ఎన్నికల గుర్తుగా ‘కారు’ ఉంటుంది. కాంగ్రెస్, బిజెపి, బీఎస్పీలకు వాటి ఎన్నికల గుర్తులు ఉండనే ఉన్నాయి. కనుక మిగిలిన పార్టీలు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.