కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ నేడే

కర్ణాటక శాసనసభ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగబోతోంది. మొత్తం 224 స్థానాలకు కాంగ్రెస్‌, బిజెపి, జెడిఎస్, స్వతంత్ర అభ్యర్ధులతో కలిపి మొత్తం 2,615 మంది పోటీ చేస్తున్నారు. మొత్తం 5.31 కోట్ల మంది నేడు ఓట్లు వేసి వారిలో తమకు నచ్చిన పార్టీని ఎన్నుకోబోతున్నారు. నేడు ఒకే దశలో జరుగబోయే పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 58,545 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి ఎంత ప్రయత్నించినా ఒక్క కర్ణాటకలో మాత్రమే అధికారంలోకి రాగలుగుతోంది. ఈ ఎన్నికల ప్రభావం తెలంగాణ శాసనసభ ఎన్నికలపై తీవ్రంగా ఉంటుంది. ఈ ఎన్నికలలో బిజెపి గెలిస్తేనే తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసం పొందగలదు. లేకుంటే కేసీఆర్‌, బిఆర్ఎస్ ఎదురుదాడిని తట్టుకోవడం చాలా కష్టమే. ఈ ఎన్నికల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉంటుంది. కనుక కర్ణాటకలో గెలుపు బిజెపికి చాలా అవసరం. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని సర్వేలన్నీ జోస్యం చెప్పాయి. కనుక కాంగ్రెస్‌, బిజెపిలలో ఏది గెలుస్తుందో తెలియాలంటే మే 13న ఫలితాలు వెలువడే వరకు ఎదురుచూడాల్సిందే.