కూతురు పోలీస్ కంప్లయింట్.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఏమన్నారంటే...

జనగామ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేరు తరచూ ఏదో ఓ వివాదంలో వినిపిస్తూనే ఉంటుంది. ఈసారి సొంత కూతురే ఆయనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మళ్ళీ వివాదంలో చిక్కుకొన్నారు. నాచారంలో సర్వే నంబర్: 1402లో ఆయన కూతురు తుల్జాభవానీకి 150 గజాల కమర్షియల్ ల్యాండ్ ఉంది. దానిని తన తండ్రి తనకు తెలియకుండా తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కినరా గ్రాండ్‌కు అగ్రిమెంట్ చేశారని తుల్జా భవానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈవిషయం మీడియా వార్తలలో ప్రధానంగా రావడంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేడు జనగామలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. నేటికీ ఆ భూమి తన కూతురు పేరు మీదే ఉందని, తాను ఆమె సంతకంతో దానిని ఎవరికీ కట్టబెట్టలేదని ముత్తిరెడ్డి చెప్పారు. అయితే తన కుమారుడు ఆ స్థలాన్ని ఒకరికి కిరాయికి ఇచ్చిన్నట్లు తర్వాత తనకు తెలిసిందని చెప్పారు. అయితే ఆ స్థలం తన కూతురిదే కనుక ఆ కిరాయి ఆమెకే వెళుతుందని ముత్తిరెడ్డి చెప్పారు. ఇందులో ఎటువంటి వివాదమూ లేదని, తనను రాజకీయంగా ఎదుర్కొలేనివారే ఈవిదంగా తన కూతురును తనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఈ వివాదం సృష్టించి, తమ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ముత్తిరెడ్డి చెప్పారు. అయితే ప్రజల ఆదరణ, సిఎం కేసీఆర్‌ ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరూ తనను ఏమీ చేయలేరని ముత్తిరెడ్డి చెప్పారు.