బిఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ప్రవీణ్‌ కుమార్‌

ఆదివారం సరూర్ నగర్‌లో జరిగిన బహుజన్ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) నిర్వహించిన బహిరంగసభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆనాడు యూపీలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమలుచేసిన పధకాలనే కేసీఆర్‌ కాపీ కొట్టి ఇక్కడ అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో బిఎస్పీ బలపడుతోందని భయపడే హైదరాబాద్‌లో 125 అడుగుల డా.అంబేడ్కర్‌ విగ్రహం, సచివాలయానికి డా.అంబేడ్కర్‌ పేరు పెట్టారు తప్ప ఆయన ఆయన మీద, బడుగు బలహీనవర్గాల ప్రజల మీద ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు.

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో రాష్ట్రంలో లక్షలాది యువత మనోధైర్యం దెబ్బతింది. అయినా కేసీఆర్‌ ప్రభుత్వం ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. తెలంగాణతో సహా దేశంలో అన్ని పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను తమ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయి తప్ప వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఏమీ చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో బిఎస్పీ అధికారంలోకి వస్తే బడుగు బలహీనవర్గాల ప్రజలు అభ్యున్నతికి కృషి చేస్తాము. వచ్చే ఎన్నికలలో బీఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌ ఉంటారు. ఆయన బడుగు బలహీనవర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు తన ఉన్నతోద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చారు,” అని మాయావతి అన్నారు.   

ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ,” నేను ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత 213 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలలో పర్యటించాను. ఏ గ్రామంలో... ఏ ఇంట్లో చూసిన కష్టాలు, కన్నీళ్ళే కనిపించాయి. కేసీఆర్‌ తన పాలన ఎంతో అద్భుతంగా ఉందని, దేశానికే ఆదర్శమని గొప్పగా చెప్పుకొంటుంటారు. కానీ తెలంగాణలో వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.  సిఎం కేసీఆర్‌కు హటాత్తుగా దళితులు మీద, డా.అంబేడ్కర్‌ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది ఎన్నికల ప్రేమే తప్ప మరోటి కాదు.

రాష్ట్రంలో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు కలిసే నాటకాలు ఆడుతూ ప్రజలను, రాజకీయ ప్రత్యర్ధులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్‌ షా గొప్పగా చెప్పడం సిగ్గుచేటు. ఇటువంటి పార్టీ మనకు అవసరమా? వచ్చే ఎన్నికలలో బీఎస్పీ రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాలకు పోటీ చేస్తుంది. వాటిలో 60-70 సీట్లు బీసీలకే ఇస్తాము. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే బడుగు బలహీనవర్గాల ప్రజల జీవితాలలో నిజమైన మార్పు తెస్తాము. ఈసారి ఎన్నికలలో బీఎస్పీ గెలుపు ఖాయం. ప్రగతి భవన్‌ మీద బీఎస్పీ జండా ఎగరడం ఖాయం,” అని అన్నారు.