
సుమారు రూ.700 కోట్లు ప్రజాధనం ఖర్చుచేసి వైట్హౌస్ని తలదన్నెలా అద్భుతంగా నిర్మించిన తెలంగాణ సచివాలయంలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లోనికి అనుమతించరా? వారికి ప్రవేశం లభించదా?అని బిజెపి ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు.
“ఈరోజు కొత్త సచివాలయంలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు సచివాలయంలోని తన ఛాంబర్లో జరిగే సమావేశానికి స్థానిక ఎమ్మెల్యేలందరూ రావలసిందిగా మెసేజ్లు పంపారు. అది చూసి నేను సచివాలయానికి వస్తే గేటు వద్ద పోలీసులు నా వాహన్నాని నిలిపివేసి లోనికి వెళ్ళేందుకు అనుమతి లేదన్నారు. లోనికి రావద్దనుకొన్నప్పుడు సమావేశానికి రమ్మనమని ఆహ్వానించడం దేనికి?పిలిచి పోలీసుల చేత అవమానించడం దేనికి?
అయినా వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులకు, ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అనుమతించనప్పుడు ఇక సామాన్యప్రజలను మాత్రం అనుమతిస్తారా? ఇదేమీ కేసీఆర్ సొంత డబ్బుతో కట్టుకొన్న సొంత భవనం కాదు కదా?మరెందుకు ఎమ్మెల్యేనైన నన్ను లోనికి అనుమతించలేదు? ప్రతిపక్ష ఎమ్మెల్యేలని లోనికి అనుమతించవద్దని కేసీఆర్ పోలీసులను ఆదేశించారా లేకపోతే వారు ఏ అధికారంతో నన్ను లోనికి వెళ్ళనీయకుండా అడ్డుకొన్నారో చెప్పాలి,” అంటూ రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగు రోజుల క్రితం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వెళ్ళబోతే ఆయనను దారిలోనే పోలీసులు అడ్డుకొన్నారు. కనుక ఎమ్మెల్యే రాజాసింగ్ అడిగిన ప్రశ్నకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వం తప్పక జవాబు చెప్పాల్సి ఉంటుంది.