తెలంగాణ సచివాలయానికి సమీపంలో హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న అమరవీరుల స్తూపం నిర్మాణ పనులు చివరిదశకు చేరుకొన్నాయి. వచ్చే నెలలో దీనికి సిఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
వెలుగుతున్న దీపం ఆకారంలో నిర్మించిన ఈ స్తూపాన్ని పూర్తిగా స్టెయిన్ స్టీల్‌తో నిర్మించడం మరో విశేషం. దీనిలో ఓ అఖండ దీపం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరో విశేషమేమిటంటే ఈ స్తూపం బలమైన గాలులను తట్టుకొంటూనే వెలుగుతున్న దీపంలా కాస్త అటూఇటూ కదులుతుంటుంది. సూర్యాస్తమయ సమయంలో ధగధగా వెలుగుతున్న దీపంలా కనిపిస్తుంది. కనుక అమరవీరుల స్తూపం చాలా విశిష్టమైనదే.
దీని ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటెయిన్, చుట్టూ ప్రమిద ఆకారంలో ఓ రెండు అంతస్తుల భవనం, దాని పైఅంతస్తులో ఓ రెస్టారెంట్, కింద అంతస్తులో 700 మంది సమావేశమయ్యేందుకు వీలుగా సకల సౌకర్యాలతో కూడిన ఓ కన్వెన్షన్ సెంటర్, ఇంకా ఎస్కలేటర్స్ వగైరా సదుపాయాలతో నిర్మిస్తున్నారు.
ఈ భవనంలో తెలంగాణ కోసం జరిగిన తొలి దశ, మలి దశ ఉద్యమాలు, అమరవీరుల వివరాలు, వారి త్యాగాలకు సంబందించి వివరాలు, పత్రికలలో వచ్చిన వార్తలు, ఫోటోలు, వీడియోలు, 15 నిమిషాలు నిడివిగల డాక్యుమెంటరీ ఫిల్మ్ వగైరా అన్నీ ఉంటాయి.
ఇక ఈ స్తూపం చుట్టూ చక్కటి ల్యాండ్ స్కేపింగ్ చేయిస్తుండటంతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారి కోసం వాహనాల పార్కింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు.