
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ జిల్లాకు, రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమి నిధులు, ప్రాజెక్టులు తీసుకువచ్చారంటే ఏమీ లేదు. అసలు ఆయన కరీంనగర్ ఎంపీ అని చెప్పుకోవడానికే మాకు సిగ్గుగా ఉంది. ఈ నాలుగేళ్ళలో ఎల్లప్పుడూ మా ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప జిల్లాకు ఉపయోగపడే ఒక్క మంచిపని చేయలేకపోయారు. కానీ మన ప్రభుత్వం కరీంనగర్ జిల్లాను చాలా అభివృద్ధి చేసింది. ఇక ముందు కూడా చేస్తూనే ఉంటుంది. గత ఎన్నికలలో వినోద్ ఓడిపోయినప్పటికీ జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో కరీంనగర్ నుంచి లోక్‌సభకు బిఆర్ఎస్ అభ్యర్ధిగా బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారు,” అని ప్రకటించారు.
బోయినపల్లి వినోద్ కుమార్ మొదట హన్మకొండ నుంచి ఆ తర్వాత ఎన్నికలలో కరీంనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కానీ గత ఎన్నికలలో కరీంనగర్ నుంచి పోటీ చేసి బండి సంజయ్ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.