
టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు అంతులేని తెలుగు డైలీ సీరియల్లాగా సాగుతున్నకొద్దీ నిందితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తవ్వుతున్న కొద్దీ కొత్తకొత్త పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వికారాబాద్‌లో ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్ కుమార్ తన తమ్ముడు రవికుమార్ కోసం డాక్యా నాయక్ నుంచి ఏఈ ప్రశ్నాపత్రం రూ.2 లక్షలకు కొనుగోలు చేసిన్నట్లు సిట్ అధికారులు కనుగొన్నారు. ఆ ప్రశ్నాపత్రంతోనే రవికుమార్ ఏఈ పరీక్ష వ్రాసిన్నట్లు గుర్తించి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. దీంతో ఈ ప్రశ్నాపత్రాల కుంభకోణంలో అరెస్ట్ అయినవారి సంఖ్య 22కి చేరింది.
ఈ కుంభకోణం బయటపడిన తర్వాత దర్యాప్తు ప్రారంభించిన సిట్ అధికారులు డాక్యా నాయక్ దంపతులను అరెస్ట్ చేసి వారి బ్యాంక్ అకౌంట్లు పరిశీలించగా దానిలో రూ.1.75 లక్షలు వికారాబాద్‌లోని భగవంత్ కుమార్ అకౌంట్ నుంచి వచ్చిన్నట్లు గుర్తించారు. దాంతో రెడ్యా నాయక్‌ను తమ శైలిలో ప్రశ్నించగా భగవంత్ కుమార్, రవికుమార్ పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ కేసులో రూ. 33.4 లక్షలు చేతులు మారిన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఈ కుంభకోణం వెనుక ఇంకా చాలా మంది ఉన్నారని, కోట్లు రూపాయలు చేతులు మారి ఉండవచ్చని కాంగ్రెస్, బిజెపిలు ఆరోపిస్తున్నాయి. ఇదే అనుమానంతో ఈడీ కూడా రంగంలో దిగి టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను ఇటీవలే ప్రశ్నించింది కూడా.
ఇక ప్రశ్నాపత్రాల లీక్ అయిన కారణంగా టిఎస్‌పీఎస్సీ గ్రూప్-1, ఏఈ పరీక్షలను రద్దు చేసి మళ్ళీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఇదే కారణంగా మరికొన్ని పరీక్షలను రీషెడ్యూల్ చేసింది.