
దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి పురస్కరించుకొని తెలుగులో తొలిసారిగా ఆయన నటించిన కౌబాయ్ చిత్రం మోసగాళ్ళకు మోసగాడు సినిమాని ఈ నెల 31న రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయం తెలియజేసేందుకు హైదరబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ఆదిశేషగిరిరావు, అశ్వినీ దత్ తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే నంది అవార్డులు ఇవ్వడం మానుకొన్నాయని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
దానిపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ, “నంది అవార్డులు ఎవరుపడితే వాళ్ళు అడిగితే ఇచ్చేయలేము. అయినా ఇంతవరకు సినీ పరిశ్రమ నుంచి ఎవరూ నంది అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎటువంటి ప్రతిపాదనా పంపలేదు. వచ్చే ఏడాది నుంచి నంది అవార్డులు ఇస్తాము,” అని అన్నారు.
ఏపీ ప్రభుత్వం తరపున ఏపీ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి వైసీపీ స్టైల్లో స్పందించారు. “అశ్వినీ దత్ వంటి వెన్నుపోటుదారు నంది అవార్డుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నంది అవార్డులకు బదులు చక్కటి పేర్లతో పారదర్శకంగా అవార్డులను ప్రకటిస్తారు,” అని అన్నారు.