లిక్కర్ స్కామ్‌లో పొరపాటున మీపేరు చేర్చాము క్షమించండి: ఈడీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై విచారణ జరుపుతున్న ఈడీ ఈ కేసులో పొరపాటున ఢిల్లీలోని ఆమాద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్‌ పేరుని చేర్చించినందుకు క్షమాపణలు కోరుతూ లేఖ వ్రాసింది. ఈ కేసులో రాహుల్ సింగ్‌కి బదులు సంజయ్ సింగ్‌ అని అచ్చు తప్పు జరిగిందని, ఈ పొరపాటుకు క్షమించవలసిందిగా కోరుతూ ఈడీ సంజయ్ సింగ్‌కు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పింది. 

ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందమూ లేదని అయినా ఈడీ తనకు నోటీస్ పంపించి తన ప్రతిష్టను దెబ్బ తీసిందంటూ ఎంపీ, సంజయ్ సింగ్‌ లీగల్ నోటీస్ పంపించడంతో ఈడీ మళ్ళీ రికార్డులు పరిశీలించుకొని పొరపాటు జరిగిందని గుర్తించి అంగీకరించింది. ఈడీ లేఖను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

దీనిపై ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, “ఛార్జ్ షీట్‌లో నిందితుల పేర్లు తప్పుగా పేర్కొవడం ఎప్పుడైనా జరిగిందా? లిక్కర్ స్కామ్‌ ఓ నకిలీ కేసని దీంతో రుజువైంది. మా పార్టీకి జనాధారణ పెరుగుతుండటంతో మోడీ ప్రభుత్వం ఓర్వలేక మా పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకే మాపై ఈ తప్పుడు కేసు పెట్టింది,” అని ట్వీట్‌ చేశారు.

ఇదే కేసులో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్ర పోషించారని ఆరోపిస్తున్న ఈడీ తాజాగా ఆమె భర్త అనిల్ కుమార్‌ పేరును కూడా ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.