దేశానేతలైనా కలవొచ్చు కానీ కేసీఆర్‌ని కలవలేము

తెలంగాణ సిఎం కేసీఆర్‌కు, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కి మద్య ఏర్పడిన విభేధాలు ఇప్పట్లో సమసిపోయేలాలేవు. జీ-20 సదస్సులో భాగంగా నేడు హైదరాబాద్‌, గచ్చిబౌలిలో జరిగిన సి-20 సమాజ్ శాల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలో అగ్రరాజ్యాలతో సహా అనేక దేశాలు ఆర్ధికరంగంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటే ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో భారత్‌ మాత్రం సుస్తిరంగా ముందుకే సాగుతోంది. 

ప్రధాని నరేంద్రమోడీ పాలనలో దేశంలోని సమస్యలకే కాక ప్రపంచదేశాల సమస్యలకు పరిష్కారం చూపుతోంది. కరోనాతో దేశంలో కనీసం 45 లక్షల మంది చనిపోతారని అగ్రరాజ్యాలు జోస్యం చెప్పగా, కేంద్ర ప్రభుత్వం అత్యంత సమర్ధంగా కరోనాను కట్టడి చేయడమే కాకుండా కరోనాకు వ్యాక్సిన్లు తయారు చేసి ప్రపంచదేశాలకు అందించింది. కనుక మనది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. 

కానీ రాష్ట్రంలో కొందరు మాట్లాడుతారే తప్ప పనిచేయరు. అభివృద్ధి అంటే ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అభివృద్ధి చెందడం కాదు. రాష్ట్రంలో ప్రజలందరి జీవితాలలో అభివృద్ధి కనిపించాలి. రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌, సచివాలయం... వాటిలో పనిచేసే వ్యక్తులందరూ కూడా ప్రజల కోసమే ఉన్నారని గుర్తుంచుకోవాలి. కరోనా సమయంలో నేను స్వయంగా గాంధీ హాస్పిటల్‌కు వెళ్ళి పరిస్థితులను సమీక్షించాను. కానీ దానినీ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన కొందరు తప్పు పట్టారు.   

రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు మద్య పెరిగిన దూరం అలాగే ఉండిపోయింది దానిని తగ్గించేందుకు నేను చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోగా ఇంకా దూరం పెరుగుతూనే ఉంది. సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకుండా రాష్ట్ర ప్రభుత్వం నన్ను అవమానించింది. పైగా ఆహ్వానించామని అబద్దం చెప్పుకోవడం దేనికి?దేశాధినేతల అపాయింట్‌మెంట్ అయినా లభిస్తుందేమో తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడం చాలా కష్టం,” అంటూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూటిగా కేసీఆర్‌ని విమర్శించారు.