కల్లు తాగిన మంత్రుల సూచన: అందరూ కల్లు తాగండహో!

అవును మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్ ఇవాళ్ళ కల్లు తాగారు. తమతో పాటు వచ్చినవారందరికీ కూడా తాగినంత తాపించారు. ప్రజలందరూ కూడా రోజూ ఇక్కడకు వచ్చి కల్లు తాగాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు! 

ఇంతకీ మంత్రులు కల్లు తాగడం ఏమిటి? అందరినీ తాగమనడం ఏమిటంటే... హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డు వద్ద ప్రభుత్వం కొత్తగా నిర్మించిన నీరాకేఫ్‌ (కల్లు దుకాణం)ను మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్ కలిసి ప్రారంభోత్సవం చేశారు. తర్వాత రెండు గ్లాసులు కల్లు... అదేనండీ నీరా వేశారు. తర్వాత అందరికీ తాపించారు. 

అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “నీరా అనేది ప్రకృతి అందిస్తున్న పానీయం. దీనిలో అనేక పోషకాలు ఉంటాయి కనుక ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది తప్ప హాని చేయదు. దీనిలో ఆల్కహాల్ ఉండదు. కనుక దీనిని ప్రతీరోజూ అందరూ తాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

“గీత కార్మికుల ఆత్మగౌరవానికి ఈ నీరా... కేఫ్ ప్రతీకలుగా నిలుస్తాయి. వారు తమ ప్రాణాలు పణంగా పెట్టి ఈ కులవృత్తిని సాగిస్తున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొనే సిఎం కేసీఆర్‌ ఈ నీరాకేఫ్ ఏర్పాటు చేయించారు. నీరా సేకరణలో ప్రమాదవశాత్తూ గీత కార్మికులు చెట్లపై నుండి కిందపడి చనిపోతుంటారు. వారి కోసం సిఎం కేసీఆర్‌ రూ.5 లక్షలు భీమా సౌకర్యం కల్పించారు. రైతులతో సమానంగా గీత కార్మికులను కూడా గౌరవించినందుకు సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము,” అని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. 


మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ కూడా తన ప్రసంగంలోనే కల్లుని కల్లు అనలేక నీరా... నీరా అంటున్నారంటే నామోషీగా ఫీల్ అవుతున్నారనే కదా?కల్లు దుకాణాన్ని ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి ఎంత ఆర్భాటంగా నిర్మించి దానికి నీరాకేఫ్ అనే అందమైన పేరు పెట్టినప్పటికీ అది కల్లు దుకాణం కాకుండా పోదు. కానీ కల్తీ మద్యం, కల్తీ కల్లు కంటే ఇది చాలా మంచిదే కనుక నగర ప్రజలు దీనిని ఆదరిస్తారనే ఆశిద్దాం.